పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0361-2 సౌరాష్ట్రం సంపుటం: 11-362

పల్లవి: ఇందు కేల అలుగ మాయింటికి విచ్చేయవయ్య
         ముందు మందె నీకు నేము మొక్కేము గాని

చ. 1: యేడ నైనా జేయి చాచే విందుకే పో సిగ్గువడి
       ఆడరాని మాటలు నే నాడితిఁ గాక
       జాడతో నేక మైతే సారె నీ వేమి సేసినా
       కూడ దనేనా నీకు గుట్టు లేదు కాగ

చ. 2: కొలువులో నుండి నీవు కొంగు వట్టి తియ్యఁగానె
       వెలయఁగ విదిలించి వేసేఁ గాక
       సెలవునఁ బానుపుపై నిన్నుఁ గసరుకొనఁగ
       చలమా నీ కక్కూరితే జరుపేపు గాక

చ. 3: నిద్దుర వోయేవేళ నీవు నన్ను లేపఁగాను
        అద్దమరేతిరి వోప నంటిఁ గాక
        యిుద్దరము సమ్మతల్లి యిటువలెఁ గూడితిమి
        అద్దో శ్రీవెంకటేశ అప్పు డేలో కాక