పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0358-6 మాళవిగౌళ సంపుటం: 11-348

పల్లవి: ఓప నన్న విడవవు వూఁకొను మనేవు నీవు
         నీ పను లివెల్లాను నిన్ననె పో వింటివి

చ. 1: మాను మన్న మానవు మా తొనె నీ సుద్దు లెల్లఁ
       దేనె పూసి చెప్పి చెప్పి తేలించేవూ
       కాని కాని అందు కేమి కల్ల లాడేవాఁడవా
       నే నెరుఁగుదు నంతాను నిన్ననె పో వింటివి

చ. 2: వద్దన్నా విడువవు వాకిటఁ గూచుండీ నీ
       పెద్దరికే లెల్ల నాతో పెంచి చెప్పేవు
       కద్దు గద్దు నీవల్ల కడము లేమి లేవు
       నిద్దరించు నీ గుణము నిన్ననె పోవింటిని

చ. 3: సిగ్గు వడ్డాఁ బో నీవు చేయ వట్టుకొని నాతో
        అగ్గలపుఁ బచ్చిమాట లవి చెప్పేవు
        దగ్గరి శ్రీవెంకటేశ తగు నన్నుఁ గూడితివి
        నిగ్గుల నీ కత లెల్ల నిన్ననేపొ వింటని