పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0358-1 పాడి సంపుటం: 11-343

పల్లవి: ముద్దు గారీఁ జూడరమ్మ మోహనమురారి వీఁడె
         మద్దులు విరిచిన మా మాధవుఁడు

చ. 1: చల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
       వల్లెతాడు మా చిన్న వాసుదేవుఁడు
       మొల్లపు గోపికల మోవిపండులకు నెల్ల
       కొల్లకాఁడు గదమ్మ మా గోల గోవిందుఁడు

చ. 2: మందడిసానుల కమ్మని మోముఁదమ్ములకు
       చెందినతుమ్మిదవో మా శ్రీ కృష్ణుఁడు
       చంద మైన దొడ్డివారి సతులవయసులకు
       విందువంటివాఁ డమ్మ మా విఠ్ఠలుఁడు

చ. 3: హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
       పొత్తుల సూత్రము మా బుద్దుల హరి
       మత్తిలి వ్రేతెల నిండుమనసుల కెల్లాను
       చిత్తజునివంటివాఁడు శ్రీవెంకటేశుఁడు