పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0357-1 నాదరామక్రియ సంపుటం: 11-337

పల్లవి: నే నెంత నీ వెంత నీతోనే బలిమా
         మానరాని కృపతోడ మన్నించితి గాక

చ. 1: చిత్తము వచ్చి నావద్ద చేరి వున్నాఁడవు గాక
       వొత్తుకోలు వల పైతే వుండేవా నీవు
       యెత్తిన కోపపుదాన నేమి బాఁతి నే నీకు
       బత్తి సేసితివి నాభాగ్య మింతే కాక

చ. 2: పిలిచితి విచ్చేసితి ప్రేమ గలుగఁగఁగాక
       సొలసితేఁ బరులకు సులభుఁడవా
       చెలులుల మీ కెంత లేదు చేరి నాతోనె మాట
       పలు కాడే విదే నాభాగ్య మింతే కాక

చ. 3: యిద్దరి మొక్కటి గాఁగ నిన్నియు నమరెఁ గాక
       పొద్దు వోనిచోట చవి వుట్టీనా నీకు
       గద్దరి శ్రీవెంకటేశ కాఁగిట నన్నుఁ గూడితి
       బద్దు గాదు మెచ్చితి నాభాగ్య మింతే కాక