పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0356-4 తెలుఁగుఁగాంబోది సంపుటం: 11-334

పల్లవి: ఏల మమ్ము భ్రమయించే రింతులాల
         తేలించేరు మాటలనే తెరవలాల

చ. 1: సిగ్గులు యెగ్గులు వాసె చీఁదక చీమిడి వాసె
       దగ్గరి మీ రుండితేఁ దరుణులాల
       వొగ్గితి మెంగిలితమ్మ కొకయింత దయ లేదు
       వెగ్గళించే రప్పటిని వెలఁదులాల

చ. 2: పాపము లన్నియుఁ దెగె బంధము లన్నియునూడె
       కొపగించుకొంటే మీరు కొమ్మలాల
       తీపుల మా దేహము తెగ నమ్మితిమి మీకు
       యేఁపుల నేల పెట్టేరు యిట్టె సతులాల

చ. 3: దావతిపాట్లు మానె తరవు లుడిగెను మా
       తోవ రాకుండితేఁ జాలు తొయ్యలులాల
       శ్రీవెంకటేశ్వరుఁడు చేరి మమ్ము దయ నేలె
       చేవ దేరె మీకు మాకుఁ జెలులాల