పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0356-1 సాళంగం సంపుటం: 11-331

పల్లవి: నీ చెయ్యే మీఁ దాయ నీకుఁ జెల్లురా నిన్ను
         యేచి వలపుల బయ లీఁదించ నైతిరా

చ. 1: మంచివానివలెనె మాట లాడఁ బిలిపించి
       కంచముపొత్తుకుఁ దీసి కాకు సేసేవు
       వంచనతో దవ్వులనె వట్టిగట్టు చేసి నిన్ను
       పెంచి నీచేఁ బ్రియము చెప్పించ నేర నైతిరా

చ. 2: బత్తి గలవానివలె పానుపుమీఁదికిఁ దీసి
       హత్తి సిగ్గువడ నంటా నట్టె నవ్వేవు
       కొత్త సతులవలెనె గొందులనుండి నిన్ను
       తత్తరాన నాడ కెడతాఁకించ నైతిరా

చ. 3: యిచ్చకునివలెనె యెలయించి నన్నుఁ గూడి
       అచ్చల నా సుద్దులెల్ల నాడుకొనేవు
       మెచ్చుగా శ్రీవెంకటేశ మేర మీరి ఆవేళనె
       కచ్చు పెట్టి నీ మోవి గంటి సేయ నైతిరా