పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0355-1 భైరవి సంపుటం: 11-325

పల్లవి: పంతము చెల్లెను నీకు పదర నేలే
         చింత దీర పతిమాట చేకొందు గాక

చ. 1: అలిగినరమణుఁడె అట్టె నిన్నుఁ బేరుకొని
       పిలిచినమీఁద నింక బిగు వేఁటికే
       తల వంచు కుండఁగాను తగ నీపైఁ జేయి వేసి
       కలయఁగ నీలోని కపటము లేఁటికే

చ. 2: చేసన్నల రానివాఁడె చెట్ట వట్టి తియ్యఁగాను
        వాసుల వంతులతోడి వాదు లేఁటికే
        ఆసల నీ వద్దనుండి అట్టె తానె ఆన వెట్టి
        సేస చల్లే పతిమీఁద చిడుముడి యేలే

చ. 3: యింటికి రానట్టివాఁడె యిటు నిన్ను వేఁడుకొని
       వెంట వెంట రాఁగానె వేస టేఁటికే
       అంటుక శ్రీవెంకటేశుఁ డాతఁడె నిన్ను గూడె
       జంటయి వుందురు గాక చల మింకా నేలే