పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0354-6 ముఖారి సంపుటం: 11-324

పల్లవి: ఏమి నేరుచుకొంటివే యెంత కుచ్చితురాలవే
         జాము వోయినా మానవు చలమే సాదించేవు

చ. 1: చూడఁ జాల వేమే యే సుదతితో మాటాడిన
       యేడా చుట్టాలు లేరా యెవ్వరి కైనా
       కూడీఁ గూడక తొల్లె కొడిమెలే కట్టేవు
       వాడలో నుండ బాసెఁగా వన్నెమగవానికి

చ. 2: వుడికి పడే విదేమే వూరివారితో నవ్వితే
       విడువ కెవ్వరి కైనా వేడుకె లేదా
       కడ నున్నవారిమీఁద కానివావులు వేసేవు
       తడవి మగవానికి తల యెత్తఁ బాసెఁగా

చ. 3: చిన్నఁబొయ్యే విది యేమే చెలుల నేఁ బిలిచితే
       యెన్న కె ముచ్చట లేదా యెవ్వరి కైనా
       చెన్నుగా నుర మెక్కితి శ్రీవెంకటేశుఁడ నేను
       యిన్నిటాఁ గూడ బాసెఁగా యితరకాంతలను