పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0354-5 శంకరాభరణం సంపుటం: 11-323

పల్లవి: మా కేమి నీ వెంత మట్టు మీరి తిరిగిన
         లోకమువారే నవ్వేరు లో వెలుతు లేలరా

చ. 1: ఆనలు నే కేమిటికి నంత నిజమరి వైతే
       కేనాన నీవే బదికేవు గాక
       వూని యన్నీ విన్నదాన నుండఁజాల కొక టంటే
       కోనలఁ దెలుపు మంటా కొంగు వట్టే వేమిరా

చ. 2: తారుకాణ లేఁటికి తప్పు లేనివాఁడ వైతే
       పేరడి నాచారములు పెంచేవు గాక
       కేరి నీవు రాకుంటే వెంగెములు ని న్నాడితేను
       పోరి పోరి పోయినిది పోనియ్య వేమిరా

చ. 3: వట్టిమాఁట లేఁటికి వలచినవాఁడ వైతే
       అట్టె అన్నిటను జాణ వయ్యేవు గాక
       యిట్టె శ్రీవెంకటేశ యిందుకె నిన్నుఁ గూడితి
       దెట్టతెరుపున నన్నుఁ దేలించే మేమిరా