పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0353-6 రామక్రియ సంపుటం: 11-318

పల్లవి: ఈ కోపా లీతాపా లిట్టె వుండీనా
         సాకిరి నేఁ దేలిపేఁగా సాదించేదానిని

చ. 1: ఆతఁ డీడకు రాఁగానె ఆన వెట్టుకొందు గాక
       కాతరానఁ జెప్పి పంపఁ గారణ మేమే
       యీతల నీ రమణుఁడు యెదుట నిలిచితేను
       చూతము వో యిట్లనె సొలసెటిదానిని

చ. 2: వోడక నిన్ను రమ్మంటే నొల్ల నందు వింతే కాక
       ఆడ నుండఁగానె లేక లంప నేఁటికే
       కూడనివారే తమిఁ గూడేరు యిప్పు డెట్టె
       తోడనె పంగించేఁ బో తొలఁగెటిదానిని

చ. 3: పెల్లున నీ వొద్దికె పిలిపించు కొందు గాక
       యిల్లురికి వచ్చి వాదు లివి యేఁటికే
       వొల్లనె శ్రీ వేంకటేశు డొద్దికతో నిన్నుఁ గూడె
       పల్లదాన నవ్వేఁ బో పాసియుండేదానిని