పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0353-4 సామంత సంపుటం: 11-316

పల్లవి: పో పో యిదేడ సుద్ది పోయినది వో నీవే
         రేపు మాపు నిదే పనే రేసు లేల పెంచేవు

చ. 1: పంతములే ఆడేవు పట్టేవు చలము
       యింతులకుఁ బతిమీఁద నింత గద్దటే
       కొంత నీచెక్క నొక్కఁగ గోరు దాఁకె నింతే కాక
       అంత నీతోఁ బగ పాడే అతఁడు వో చెలియ

చ. 2: పిలిచితేఁ గసరేవు పెనఁగితే విసిగేవు
       వలచినయీతనితో వాదు లేఁటికే
       బలిమి నిన్నుఁ బట్టఁగ పాపట చెదరెఁ గాక
       వలె వలె నని నీతో వాదులకు వచ్చెనా

చ. 3: నిట్టూర్పు నించేవు నివ్వెరగుఁ బొందేవు
       యిట్టె శ్రీవెంకటెశు నేఁప నేఁటికే
       గుట్టుతోఁ గాఁగిలించఁగఁ గొప్పు వీడె నింతె కాక
       తొట్టిన రతులోన దొమ్మి సేయ వచ్చెనా