పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0353-3 తెలుఁగుఁగాంబోది సంపుటం: 11-315

పల్లవి: అందరూ విన్నవి నే నాడేఁ గాని
         సందడింపుమేకులకు చాలఁ బో నేనూ

చ. 1: సేయ రానిపను లైనఁ జేసేఁ గాని
       వో యయ్య నీ వినయము లొల్లఁ బో నేను
       పాయరానిరాజసాన బడేఁగాని
       వే యైన నీయానలు వినలేఁ బో నేనూ

చ. 2: నగవు రాకుండినను నవ్వేఁ గాని
       వొగరు మోహము చల్ల నోపఁ బో నేను
       మొగమోటఁ గొండెత్తిన మోచేఁ గాని
       తెగువతో నీ గుణము తిద్దలేఁ బో నేనూ

చ. 3: వొదిగి పానుపుమీఁద నుండేఁ గాని
       చెదర నిన్నింత పచ్చి నేయఁ బో నేను
       పొదిగి శ్రీవెంకటేశ భోగించితి నీవు
       వెదకి నీ వెం దున్న విడువలేఁ బో నేనూ