పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0352-4 శుద్దవసంతం సంపుటం: 11-310

పల్లవి: అందుకే వెర గయ్యీనె అప్పటనుండియు మాకు
         అందినవారికి మిన్ను అరచేతిదే

చ. 1: పతిమాఁటాడ విదేమే పలుమారుఁ దమకాన
       అతఁడు నీతో మాట లాడఁగాను
       యిత వై యెక్కినవారి కేనుగ గుజ్జన్న మాట
       కతలుగా నీయందె కంటిమే నేము

చ. 2: గక్కన రావది యేమె ఘనుఁడు నవ్వుతా నిన్ను
       తెక్కులనె చేయి వట్టి తియ్యఁగాను
       నొక్క టై పాలు వోసితే వోకివింత లన్నమాఁట
       మిక్కిలి నీవల్లనె మెరసెనే నేఁడు

చ. 3: శ్రీవెంకటేశ్వరుఁడు చేయి నీపై వేయఁగాను
       నోవ దనక వాఁడిచన్నుల నొత్తేవు
       పూవులవేసినవారిఁ బొంచి రాల వేసినట్టి
       భావము నీయందె కంటి భళి భళి గుణములూ