పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0352-2 నాదరామక్రియ సంపుటం: 11-308

పల్లవి: ఆసలును రేసులను అవి రెండు నేలే
         కాసు సేయనిపనికి కాఁతాళ మేలే

చ. 1: అలిగినవాఁడు తా నారడనే వుండుఁ గాక
       పిలిచి వాదుకు వచ్చి పెనఁగ నేలే
       కలయనివాఁడు తాను కడు వాసి నుండుఁ గాక
       వొలిసి దగ్గరి తగవుకుఁ దియ్య నేలే

చ. 2: మాటలాడనివాఁడు తా మారుమో మై వుండుఁ గాక
       తేటలుగా సారె మమ్ముఁ దిట్టఁగ నేలే
       నీటున నుండెటివాఁడు నిక్కము బిగుసుఁ గాక
       చీటికి మాటికి మాపైఁ జెయి చాఁచ నేలే

చ. 3: కాఁకలు సేసెటివాఁడు కన్నులనె చూచుఁ గాక
       యేఁకటఁ గాఁగిలించీ నన్నింతలో నేలే
       వేఁకపు శ్రీవెంకటాద్రివిభుఁ డిట్టె నన్నుఁ గూడె
       మాఁకువలె నన్ను మేను మరపించ నేలే