పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0352-1 ముఖారి సంపుటం: 11-307

పల్లవి: ఓసి పోపో నీకు నేమె వుండఁబట్టదా
         వాసులు రేసు లెక్కించి వాదుకు వచ్చేవా

చ. 1: నిరతి నామీఁదట నీ కోప మెంత గల్ల
       సొరిది యాతనిమీఁదఁ జూపవే పోయి
       మరిగినవారితోడ మాటలాడఁ బాసెనా
       వరుస నిల్లురి కేల వాదుకు వచ్చేవే

చ. 2: సారె సారె న న్నెంత సాదించఁ గలిగినాను
       మేర మీరి నీ వాతనిమీఁద వెళ్లించు
       కూరిమి గలుచుచోటఁ గూడినదె నేరమా
       వారి వీరి మాట కేల వాదుకు వచ్చేవే

చ. 3: మలసి నామీఁదట మచ్చర మెంత గల్లాను
       నెలవుగా నతనిపై నెరపఁగదే
       యెలమి శ్రీవెంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
       వలవనిజోలి నేల వాదుకు వచ్చేవే