పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0350-4 లలిత సంపుటం: 11-298

పల్లవి: తాలిమి చక్కన గాని తనుక మెం తైనాఁ గద్దు
         మేల మాడ వయ్య చెలి మీఁద మీఁద నున్నది

చ. 1: వనితి పువ్వులవేసి వలపు నీపైఁ బూసి
       తనుఁ దానె సిగ్గుపడి తల వంచీని
       మనసు నీపై బెట్టి మాఁటలు మాతో నాడీ
       పెనఁగి పిలువవయ్య పేరుకొని నీవు

చ. 2: పడఁతి నీతో నవ్వి పాయపుటాసలు దవ్వి
       చిడుముడి సిగ్గుతోడఁ జెమరించీని
       కడు నిన్నట్టె చూచి కాయము మాపై వేసీ
       వొడి వట్టి తియ్యవయ్య వొద్దికతో నీవు

చ. 3: కలికి నీకాలు దొక్కి కమ్మటి నీకు మొక్కి
       వలవనిసిగ్గుతోడ వడఁ బడీని
       నెల వై శ్రీవెంకటేశ నిన్నుఁ గూడె తన్నుఁ దానె
       అలమి పైకొన వయ్య అప్పటివి నీవు