పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0350-2 పాడి సంపుటం: 11-296

పల్లవి: ఇయ్యకొన వద్దా నీ వింతట నైనా
         అయ్యో యైమయ్యి నీకు ఆసపడీఁ జెలియా

చ. 1: చెక్కుల జవ్వాది జార చిరునవ్వు మోవిఁ దేర
       నిక్కి చూచి మోహించె నీకు నల్లదె
       చక్కని యా లలితాంగి సారె సారె మాఁటలలో
       మక్కువ వలపు చల్లీ మదనరాగమునా

చ. 2: తను వెల్లఁ జెమరించి తరిపులకలు నించి
       మనసు నీ కప్పగించి మలసీ నదె
       అనుఁగుఁబాయపుసతి ఆడనుండి సన్న సేసి
       తనుఁ దానె కరఁగీని దప్పి దేరే మోవిని

చ. 3: ముచ్చట సిగ్గులు వీఁగ ముక్కున నూర్పులు రేఁగ
       యిచ్చటికి విచ్చేసె నింతలో నాపె
       పచ్చిగా శ్రీవెంకటేశ పడఁతి నిన్నిటు గూడి
       తచ్చన నీతో నాడీ తమకపురతులా