పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0350-1 నాదరామక్రియ సంపుటం: 11-295

పల్లవి: ఇంతలోనివాఁడవా యేరా నీవు
         చెంతల నీకె యివి చెల్లురా నేఁడు

చ. 1: దగ్గరి రా వని నిన్నుఁ దమకానఁ దిట్టితేను
       యెగ్గులు సిగ్గులు నెంచే వేరా నీవు
       అగ్గల మై నీతోడి అంకెకత్తెనా నేను
       దగ్గరినంతాఁ గలిగె తగురా నాకు

చ. 2: తప్పక చూడ వనుచు తామరఁ గొని వేసితే
       యిప్పు డింతలో నలిగే వేరా నీవు
       కప్పి నీకు నే నింత కంటకపుదాననా
       చెప్పినంతాఁ గలిగెను చెలు లెల్ల నాకు

చ. 3: పరవశ మైతి వని పక్కన గోర నూఁదితే
       యెరవుగాఁ జూచేవు యేరా నీవు
       సరవి శ్రీవెంకటేశ చన విచ్చి కూడితివి
       సరవు లన్నియు గలిగె చాలురా చలము