పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0349-3 మధ్యమావతి సంపుటం: 11-291

పల్లవి: పొదిగి మమ్ము రేఁచక పో పో నీవు
         పొదరు లాడక నీవు పో పో నీవు

చ. 1: గద్దరి నీ మాఁటలకు కడ మొదలే లేదు
       పొద్దు వోయ నలసితి పో పో నీవు
       అద్దలించి నన్నే నీవు ఆన వెట్ట వచ్చేవు
       బుద్దు లంత నేరవు పోపో నీవు

చ. 2: కడ నున్న యాఁడువారి కాలు దొక్క వచ్చేవు
       పొడవులు చూపక పో పో నీవు
       విడు విడు నీ సుద్ది వింతలా మా కేమి నీవు
       పుడకక మమ్మంత పో పో నీవు

చ. 3: కెరలించ కంత మమ్ము కేరి నీగుట్టే చాలు
       పొరుగువారు నవ్వేరు పో పో నీవు
       గరిమ శ్రీవెంకటాద్రి కడపరాయఁడ నన్ను
       పురిగొనఁ గూడితివి పో పో నీవు