పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0348-5 వరాళి సంపుటం: 11-287

పల్లవి: అప్పటి నిచ్చక మాడే వట్టె నాకు
         తప్పని బొంకని మంచి తగవరి వౌదువు

చ. 1: చాపలాన మాయిద్దరి జగడాలు దిద్దవచ్చి
       ఆపెమాఁటె వంక లొత్తే వప్పటినీవు
       తీపు నీ కామాఁట లైతే తిట్టించుకొందు గాని
       పోపో నే నందు కోప పోటిదొర వౌదువు

చ. 2: యెదుట మాకల్లా నిజ మేరుపరచఁగ వచ్చి
       అదె పతివాది వయ్యే నప్పటినీవు
       బెదరితే నీ వాకెకె ప్రియము చెప్పుదు గాని
       కదిసి నన్నుఁ బట్టకు కడు జాణ వౌదువు

చ. 3: వెడ్డు వెట్టి మమ్ము నేఁడు వేఁడుకొన నిటు వచ్చి
       అడ్డము లాపెకు వచ్చే వప్పటినీవు
       వొడ్డినకోపము దీర వొక రొకరిఁ గూడితి
       వెడ్డవు గావు శ్రీ వెంకటేశ్వరుఁడ వౌదువు