పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0347-6 పాడి సంపుటం: 11-282

పల్లవి: ఏఁట తలఁ పేఁటి పొందు యీస్సీ రోఁతరా
         ఆఁటదాని బతు కెల్ల ఆగడమె ఆయఁగా

చ. 1: చిత్తము రావలె నంటాఁ జెప్పిన ట్టెల్లఁ జేసితి
       హత్తి యేమిటాఁ గరఁగ వయ్యో యేలరా
       పొత్తుకు రానైతి నంటా వూఁచి కోపించుకొంటివి
       యిత్తల నీ నా పొందులు యింతలోని వాయఁగా

చ. 2: చనవరి నయ్యే నంటా సర వెల్ల నడపితి
       మనసులో తమకాలు మాన వేలరా
       మునుపె నే నవ్వ నంటా మోము ముడుచుకొంటివి
       వెనకటి నామే లెల్ల వేరే వేరే ఆయరా

చ. 3: కందువ నెరవు లెక కాఁపుర మెల్ల జేసితి
        యిందులోన మెచ్చఁ జాల వింకా నేలరా
        విందువలె నేఁటిదో శ్రీవెంకటేశ కూడితివి
        చెందిన నా ఆయము నీ చేతికి లో నాయఁగా