పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0347-5 నాదరామక్రియ సంపుటం: 11-281

పల్లవి: ఏమి సేసినాఁ జెల్లురా యీవేళ నీకు
         కామించి నీకుఁగా నేను కడు వలచితిరా

చ. 1: వొల్లనివాఁడ వై వుండీ వొక్కొక్క నెపము వేసి
       కల్లయలుకలు గాఁ గాటారించేవు
       చెల్లు లేరా నీకు నిది సేన సతులు గలరు
       వెల్లవిరి నొక్కతెనె వెఱ్ఱి నైతి నేనరా

చ. 2: యెందు వోఁ దలఁచితివో యెదో పని గడించుక
       విందువలెఁ బోయే నంటా వేగిరించేవు
       నింద లేదురా నీకును నీ విట్టె మగవాఁడవు
       అంది పొంది నేనె నీకు ఆల నైతిఁ గదారా

చ. 3: చేరి నన్ను భ్రమించి నాచిత్తము చూడ వలసి
        వారి వీరిఁ జూపి నాకు వాసి రేఁచేవు
        యేర శ్రీవెంకటేశుఁడ యిట్టె నన్నుఁ గూడితివి
        ధారుణి నీ రప మాయ తగు లైతిఁ గదరా