పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0346-5 రామక్రియ సంపుటం: 11-275

పల్లవి: నే నున్న దెస యెంత నేఁడు దనవేడు కెంత
         పానిపట్టి యితంలో నే బాఁ తైతినా

చ. 1: అలిగి నే నవ్వలి మోమై వూరకుండేదాని
       నలరి పాదము లొత్తు మనీనె తాను
       తలఁకి సిగ్గు వడఁడు తనకు నా కంత పొందా
       మలసి తనచేఁతలు మరచెనా తాను

చ. 2: చింతతోడ చెక్కు చేత సిగ్గువడి వున్నదాని
       యింతలో నాకు మడిచి యిమ్మనీఁ దాను
       మంతనా లాడఁగ వచ్చీ మంచి చుట్టమె నాకు
       వింత దన కానోటనె వెళ్లెనా ప్రియము

చ. 3: పట్టెమంచముపై నొంటిఁ బవ్వళించి వున్నదాని
       అట్టె తా వచ్చితిని లెమ్మనీనె తాను
       దిట్టయై శ్రీవెంకటాద్రిదేవుఁడు నన్నిటు గూడె
       గుట్టునను గతి గూడుకొనెఁ గదె యిపుడు