పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0346-4 శంకరాభరణం సంపుటం: 11-274

పల్లవి: లెస్స బుద్ది చెప్పరే లేమ లిందరుఁ గూడి
         వుస్సు రస్సు రనఁగానె వొద్దికి నేఁ బోదునా

చ. 1: పై పై నవ్వేవారితోడ పలుకఁగ వచ్చుఁగాక
       కోపగించఁగా కూరిమి గొసరఁగ వచ్చునా
       యేపున రమణుఁ డయితే యెదురు రా నైతి నంటా
       ఆఁప లేక తిట్టఁగాను అండకుఁ బిలుతునా

చ. 2: వలచినవారితోడ వా దైన నమరుఁ గాక
       యిలఁ బగవారితోడ యిచ్చకము చెల్లునా
       కులికి యప్పుడు నేను గోరు దాఁకించితి నంటా
       అలిగేటివానికే ఆకుమడి చిత్తునా

చ. 3: ఆదరించేవారితోడ నంటి పొందవలెఁ గాక
       గోదిలేటి మగవాని కొంగు వట్ట వచ్చునా
       యీదెస శ్రీవెంకటేశుఁ డింత నేసి నన్నుఁ గూడె
       పాదుకొని వుండఁగాను పంత మిచ్చే నందునా