పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0345-6 నాదరామక్రియ సంపుటం: 11-270

పల్లవి: చిమ్ముచుఁ దియ్యనినోరఁ జేఁ దేల
         నెమ్మది నాకె వుండఁగ నే మేలా

చ. 1: మన సిచ్చి నీతోడ మాఁట లాడేవారితోనె
       అనవయ్య పోయి నీ వామాఁట
       వెనకటిమాఁటలకె వేదనఁ బొరలేమమ్ము
       చెనకి మరిఁ గొంత చింత రేఁచ వలెనా

చ. 2: మొగము చూచి నీకు మొక్కెటివారితోనె
       నగవయ్య పోయి నీవు నయమునా
       జగడించి పైఁ జేయి చాఁచి మూల నున్ననన్ను
       తగిలి తగిలి యింకఁ దతి గొన వలెనా

చ. 3: పలుమారు సిగ్గుదేరి పారితెంచేవారినె
       పిలవవయ్య పోయి ప్రియమునా
       అలిగిననన్ను నిట్టె ఆదరించి కూడితివి
       యెలమి శ్రీవెంకటేశ యిఁకఁ గొంత వలెనా