పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0345-2 మంగళకౌశిక సంపుటం: 11-266

పల్లవి: చెలులాల మీరె యింత సేసితె రిద్దరి నేఁడు
         కలయనిమాసటీలఁ గదియింతురా

చ. 1: తక్కరీఁ డంటిఁ గదవే దంట వీఁ డంటిఁ గదవే
       అక్కడికతలే చెప్పీ నంటిఁ గదవే
       యెక్కువ నాతో నాడేదె మాఁటకె మాఁట
       యిక్కడికి వచ్చు టెల్ల యిందుకొరకా

చ. 2: చలమరి యంటిఁ గదే చల్లజం పంటిఁ గదవే
        అలపు సొలపె ఘన మంటిఁ గదవే
        తలవాకిటనె వుండి తనకు నా కేఁటి పొందే
        వలపు నామీఁదఁ జల్లేవరుసా యిది

చ. 3: వేసదారి యంటిఁ గదె వేగిరకాఁ డంటిఁ గదే
        ఆసలు చూపిన లో నౌ నంటిఁ గదవే
        బాసతో శ్రీవెంకటాదిపతి నిన్ను నిటు గూడె
        మోస మెల్లఁ దీరె నింక మొక్కెంచేరా