పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0345-1 ముఖారి సంపుటం: 11-265

పల్లవి: ఊరకున్న నన్ను నేల వుడికించ వచ్చేవు
         చేరి నీకు యెంత పగ సేసితినో కాని

చ. 1: కొంగు వట్టి తియ్యకుర కూచున్న దాని నన్ను
       వుంగిటే నే రా నోప నొళ్లు నొచ్చీని
       యింగితాన నన్నుఁ జూచి యించుకంత దయ లేవు
       సంగడి నే నెంత పాపజాతినో కాని

చ. 2: బలిమి శాయకురా పలుకఁగ నోప నీతో
       లలి నామనసు వొకలా గయ్యీని
       తలఁపు నీ వెరిఁగియు తతిగొని పోరేవు
       యెలమి నే నేఁటిజన్న మెత్తితినో కాని

చ. 3: కాఁగిలించి పట్టకురా కమ్మటి యిట్టె పొంది
       వీగి నిన్నుఁ బాయ నోప వేస టయ్యీని
       దాఁగక శ్రీవెంకటేశ తగ నన్నుఁ గూడితిని
       రాఁగి యెంత భాగ్యవంతురాలనో కాని