పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0344-5 లలిత సంపుటం: 11-263

పల్లవి: నీవేడ నే నేడ నేఁడు సిగ్గు వడఁ గాక
         భావించి నీకొంగు వట్టెబలువు నా కున్నదా

చ. 1: నిగిడి పదారువేలు నెలఁతలు గల నీకు
       జగతి నింకా సతులు సర కయ్యేరా
       వగలతో నెరఁగక వలచినదాన నై
       జిగి నా మగండ వంటాఁ జెప్పకోనేఁగాక

చ. 2: తొరలి సీత నడవిఁ దోసి రప్పించిననీకు
       తరుణులమీఁదఁ గొంత దయ వున్నదా
       గరిమి నీ భ్రమఁ బడి గతి లేనిదాన నై
       పరులు చూడఁగ నీ పాద మొత్తేఁ గాక

చ. 3: తొడపై శ్రీసతిఁ బెట్టి దొడ్డకొలు వున్ననీకు
        తడవి నాపొందు లింకాఁ దల పయ్యీనా
        యెడయక శ్రీవెంకటేశ కూడినదాననై
        బడి వాయక నీవొద్ద బతికితిఁ గాక