పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0344-1 లలిత సంపుటం: 11-259

పల్లవి: కపటము మాన వైతి కలకాలము
         ఉపమ లింతేసి యాపె కున్నవా మొదలను

చ. 1: యే మని చెప్పెంపితివో యింతితో యేకతమున
        ఆమాఁట వింటానె ఆకె వచ్చెను
        నీమతకమె కాఁబోలు నేఁడు నాతో జగడించీ
        యీ మగుమాకు నిన్నాళ్లు యింత బలు వున్నదా

చ. 2: సన్న యేమి సేసితివో సరి నాపెమోము చూచి
       పన్ని నీ సంగడి వచ్చి పవ్వళించెను
       కన్నెకు నీ యప్పణి కాఁబోలు నన్ను గద్దించీ
       యెన్నఁడైనా యీపె నాతో యీసడించ వచ్చునా

చ. 3: యెప్పుడు నేరిపితివో యీపెకు నీగుణములు
       వొప్పుగ నా కిటు మొక్కి వొక్క టాయను
       తప్పు దీరఁ గూడితివి దగ్గరి శ్రీవెంకటేశ
       మెప్పించితి నీవు నన్ను మే లిం తెరుఁగునా