పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0343-4 వరాళి సంపుటం: 11-256

పల్లవి: ఎప్పుడను వారు వారు నేకము గాక మానరు
         యిప్పటికిఁ దగినట్టు యిచ్చకమె ఆడరే

చ. 1: కొసరి విభునిఁ దిట్టి కోపగించి మాఁట లాడి
       అసురుసు రై యలసి అట్టె పవ్వళించెను
       పసగా నారగించదు పగలును యిప్పు డైన
       అసము దించఁగ లేపి ఆరగించఁ బెట్టరే

చ. 2: తానె వొట్టు వెట్టుకొని తరుణి యాతఁ డిచ్చిన
       కానుకకప్పుర మెల్ల కడఁ బారఁ జల్లెను
       మోనమున దప్పి గొనె ముంచి మీ రైన విడెము
       ఆనవెట్టి యిచ్చి యిట్టె ఆకుమడి చియ్యరే

చ. 3: వోవలనె వేగిరించి వూరకె నిందలు గట్టి
       శ్రీవెంకటేశ్వరుఁ జూచి శిగ్గువడి వున్నది
       కైవసమై అతఁడె గారవించి చెలిఁ గూడె
       యీవల నూడిగములు యేమరక సేయరే