పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0343-3 ఆహిరి సంపుటం: 11-255

పల్లవి: ఏమి చూచేవు నావంక యిం దేమైన తప్పు గద్దో
         ప్రేమము నీ కొప్పంచితి బిగు వింక నేలా

చ. 1: నిక్కి నా విరహము నీకు మే లైతేఁ జాలు
       ముక్క వోయి నా మోహములోన
       వొక్కరి కైన సెలవు వున్నదిగా యీ బదుకు
       చక్కని వో రమణుఁడ చాలదా యీజన్మము

చ. 2: చింతతోడ నే నుండేది సెలవు నీ కైతేఁ జాలు
        పంతము దప్పెనా నాబలువుకును
        వంతు వాసి కెక్కఁగా నావగ పోకచోట నైన
        సంత మైన నాయకుఁడ చాలదా నాజన్మము

చ. 3: ఆసలచే వేఁగేది నీ కంత వేడు కైతేఁ జాలు
        దోసమా నా సైరణకు దొండి వోయీనా
        యీసు లేక శ్రీవెంకటేశుఁడ నన్నుఁ గూడితి
        శాసించ నేఁటికి నిన్నుఁ జాలదా నా జన్మము