పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0343-1 వరాళి సంపుటం: 11-253

పల్లవి: చెల్లఁబో నీ చెప్పినట్టు సేయ నైతినా వోరి
         కల్లతో నిజ మోపదు కల దింతే కాక

చ. 1: కోపగించుకొన నేల కోరి వేఁడుకొన నేల
       యేపున నిట్టె రెండూ యెడ్డతనమే
       పై పై చేఁదు దిన నేల పంచదార నంజ నేల
       పూపవయసులవారి పుణ్య మింతే కాక

చ. 2: అట్టె కల్ల లాడ నేల ఆనలు వెట్టుకో నేల
        యెట్టివారి కైన యివి యెడ్డతనమే
        మెట్టి చలిఁ బడ నేల మించి సీతు గాయ నేల
        పట్టి వలచినవారి భాగ్య మింతే కాక

చ. 3: చలము సాధించ నేల సారెకు వగవ నేల
        యెలమితో నివి రెండు యెడ్డతనమే
        పిలిచ శ్రీవెంకటేశ పెనఁగి నన్నుఁ గూడితి
        పలుకుఁబంతాన నీ నా బలు వింతే కాక