పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0342-6 గౌళ సంపుటం: 11-252

పల్లవి: ఆపెమీఁద మోహ మైతే నౌదువు గాక
         మోపుగా నా మీఁద నెపములు వేయ వలెనా

చ. 1: నిన్ను నేమైన నంటినా నేనె తిట్టుకొంటిఁ గాక
       కన్ను లెఱ్ఱఁ జేసి నీవె కాఁగి పడేవు
       వన్నెల కెందో పొయ్యేవాఁడ వట్టె పోదు గాక
       అన్నిటా నాతో నేఁడు అలిగి పోవలెనా

చ. 2: చేరి నిన్ను దొబ్బితి నా చే వట్టకు మంటిఁ గాక
        పారి పారి రొమ్ము దట్టి పగ చాటేవు
        ఆరీతిఁ బెండ్లాడేవాఁడ వట్టె పెండ్లాడుదు గాక
        యీరీతి వాదు వెట్టుక యింత సేయ వలెనా

చ. 3: చెల్ల బో కైకో కుంటినా సిగ్గున నుంటిఁ కాక
       వొల్లనె నన్నింత దూరి వోల వేసేవు
       కొల్లగా శ్రీవెంకటేశ కూడితిని నన్ను నేఁడు
       చిల్లర సతిని నాచేతి కియ్య వలెనా