పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0342-4 శంకరాభరణం సంపుటం: 11-250

పల్లవి: ఇంత నీవు మన్నించుట యిందుకా నన్ను
         వింతవారిఁ బతి వెట్ట వేడుకా నీకు

చ. 1: ఆపె నన్ను నాడఁగా నే నాపెతో వా దడువఁగ
       యేపున వినేవు నీకు యేమి గూడెరా
       వోపి కల్ల గలవారి నొద్దంటే దోసమా
       చేపట్టి నీ కేమి పగ సేసితిరా నేనూ

చ. 2: సవతి పగ చాటఁగ సారె నేఁ బగ చాటఁగా
       భువిలోఁ జూచేది నీకుఁ బుణ్యమా నేఁడు
       వివరించి మా మొర విచారించఁ దగదా
       కవ కవ నవ్వి నవ్వి గండి గట్టుకొంటివా

చ. 3: చేతు లాపె చాఁచఁగాను చేరి నే నొట్టు వెట్టఁగ
       యీతల నడ్డము రావు యిదె తగునా
       జాతిగ శ్రీవెంకటేశ చన విచ్చితివి నాకు
       యేతుల నిన్నుఁ గూడితి యిక నేల మరఁగూ