పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0342-1 శంకరాభరణం సంపుటం: 11-247

పల్లవి: ఊర కుండ నీరా మమ్ము నుడికించకా
         గారివించే నీ నవ్వు గాలమునో నాకు

చ. 1: చిణుతనవ్వు నవ్వఁగా చెక్కు నొక్కి యెత్తి నన్ను
       కఱఁచేవు మరికొంత కారింపే కాదా
       తణి నీ మనసుననుఁ దలఁచిన ట్లుండు
       గుఱిగా నదివో నాకు గుండెలోనీ అమ్ము

చ. 2: మంచముపై నుండఁగాను మచ్చిక నావొద్దఁ బండి
       ముంచి చేయి వేసే వది మోపే కాదా
       యెంచి నీకుఁ జూడ నది యిచ్చక మైనట్లుండు
       తెంచరాని పొద్దు వొద్దు దిగులువో నాకు

చ. 3: భ్రమసి నేనుండఁగాను పట్టి నన్నుఁ గాఁగిలించి
       తమకించే విది గొంత తగులే కాదా
       అమర శ్రీవెంకటేశ ఆదరించి కూడితివి
       చెమటలు నీకుఁ గాని సేసలువో నాకు