పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0341-1 నాగవరాళి సంపుటం: 11-241

పల్లవి: పొద్దు వోక నీవు నాతో బొంక వచ్చే వింతే కాక
         గద్దించి నీ వెట్టుండినఁ గాదు గూడ దనేనా

చ. 1: న న్నొడఁ బరచకుర నమ్మికలు సేయకుర
       నిన్నే మయిన నంటినా నీవు గొంకేవు
       అన్నిట లోకమువారు ఆడుకొందు రింతే కాక
       విన్న నీ సుద్దులు నేను వెల్లవిరి సేసేనా

చ. 2: యింత న న్నుబ్బించకుర యిచ్చకాలు సేయకుర
       జంత నై ని న్నిఁక నే సాదించేనా
       కాంతుఁడ నీ చుట్టాలు పక్కాలు నమ్మ రింతే కాక
       మంతనాన నీపై నింద మరి వేసేనా

చ. 3: గడ్డము వట్టకురా కాఁగిట నించకురా
       యెడ్డనై నీమాటకు నే నెదు రాడేనా
       వెడ్డు వెట్టి యిట్ల శ్రీవెంకటేశ కూడితివి
       దొడ్డదొర వైన నిన్ను దూరు కెక్కించేనా