పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0340-3 పాడి సంపుటం: 11-237

పల్లవి: ని న్ననఁగ దోసమురా నీకు సాజ మీ గుణము
         యిన్నిటా నా మొగమోటే యింత దెచ్చె నాకు

చ. 1: కక్కసించి పెనఁగేవు కటారికాఁ డవా వోరి
       వొక్కమాఁటె యింతయితే నోపరా నేను
       యెక్కు వైన సటకాఁడ వెవ్వ రిచ్చి రీ బిగువు
       మొక్కలపువలపులు మొన లాయ నాకు

చ. 2: అడ్డగించు కొంటివి నా కప్పులవాఁడవా వోరి
       గొడ్డేరు నీ కొద్ది కాదు కోపము నాకు
       యెడ్డతనాలనె తొల్లి యెందరి భ్రమయించితి
       వడ్డితో నా నవ్వులె పై వచ్చెరా నాకు

చ. 3: కూరిమిఁ గాలు చాఁచేవు కొనుకొంటివా వోరి
       వూరకె పతికిఁ బతి వోపనా నేను
       వేరు లేక నన్నును శ్రీవెంకటేశ కూడితివి
       మేరతో నింత నోమితి మేలురా నాకు