పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0340-1 భైరవి సంపుటం: 11-235

పల్లవి: నవ్వుతా నేఁ దిట్టితేను నయ మిచ్చీనా
         జవ్వనపు చల్లజంపు చలమరివాఁడు

చ. 1: మింగినచదువు వోతే మిట్టి మీ నై పడ్డవాఁడు
       కుంగినకొండకుఁ దల గుట్టుకొన్నాఁడు
       ముంగిట నొకసతిని మోరతోపు సేసినవాఁడు
       సంగతిగ నీ పడుచుజగడాలవాఁడు

చ. 2: అడిగెఁడు నేలకుఁ గా నాకస మంటినవాఁడు
       గొడవకె తిరిగెటి కోపకాఁడు
       అడరి వుత్తమురాలి నగ్గిబాస గొన్నవాఁడు
       సడి బెట్టి మేనమామఁ జంపినవాఁడు

చ. 3: చిల్లో యంటే పొల్లో యని సిగ్గు విడిచినవాఁడు
        పెల్లు రేఁగి పరువులు పెట్టెడివాఁడు
        యిల్లిదె శ్రీవెంకటాద్రి యెక్కి నన్నుఁ గూడె నేఁడు
        బల్లిదుఁడై దేవతల పట్ట మేలేవాఁడు