పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0339-4 బౌళిరామక్రియ సంపుటం: 11-232

పల్లవి: అన్నిటా ఘనుఁడు దాను అందు కేఁటిదే
         వున్నట్టే చెప్పఁ గదరే వూరకుండ నేలా

చ. 1: చెలులఁ దా నంపివాఁడు చెంతనే రాకుండ గాఁను
       అలిగి వుందానఁ దొల్లె అందు కేఁటిదే
       కలఁగి ముంగోపమున కానివొట్టు వెట్టుకొంటి
       పిలిపించ రాదు నాకు పిన్నదాన నేను

చ. 2: ముంచి లేక లంపినాఁడు మొక్కితి నే నన్నాఁడు
       యెంచితే నెంతయినఁ గద్దు యే మందునే
       పంచుక యిందరిలోనఁ బంత మెల్ల నాడుకొంటి
       అంచల నాకు రారాదు ఆఁటదాన నేను

చ. 3: సంగడిఁ గూచున్నాఁడు చన వెల్ల నిచ్చినాఁడు
       యెంగిలిమో వడిగీని యే మందునే
       సంగతై శ్రీవెంకటేశ్వరుఁ డిట్టె నన్నుఁ గూడె
       చెంగట మెచ్చఁగ రాదు సిగ్గుతోడి నేను