పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0339-2 శంకరాభరణం సంపుటం: 11-230

పల్లవి: ఏఁటి జన్న మెత్తితి నే నిదె నీకు వెగ టైతి
         గాఁటపు నీకు గుంటెనకత్తె నైన మేలూ

చ. 1: చూచిన నీ చూపు లివి చుఱుకున నాఁటీ నన్ను
       చేచేత నీ కేమి పగ చేసితి నేను
       యీ చాయ నాకే వెఱచే వెవ్వతె నాతో నవ్వినా
       కాచి గండెదిగు లైతిఁగా నీకు నేను

చ. 2: ఆడిన నీ మాఁట లెల్ల అట్ట లదరించీ నన్ను
       కోడెకాఁడ నీకు నెంత కొల యైతినో
       వోడక యిందరిచేతా నొడఁబఱపించేవు
       యీడ నీకు మోచి దింపై యింతేసి ఱ ట్టైతిఁ గా

చ. 3: నడుమ నీ వలపులు నాకుఁ గాళ్లఁ బెనఁగిని
       కడు నీకు నెన్నాళ్ల సంగర మైతినో
       యెడయక శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
       బడి బడిఁ గాచుకుండఁ బా లైతిఁగా