పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0338-5 వసంతం సంపుటం: 11-227

పల్లవి: గుమితాన రేపు మాపుఁ గోసి రాపించఁగ నేల
         సముకాన దాని నన్ను జగడించ విడరా

చ. 1: దుండగాన నాపెచేతఁ దుటారము లాడించేవు
       అండకు రావ ద్దంటే నే నట్టే మానవా
       చండి పెట్టి యాఁటదాని జవ్వనము గాకు సేసి
       కండ గట్టుకొంటేఁ జాలు కా దనేనా నేను

చ. 2: చన విచ్చి యాపె నాతో సరి వోరించఁగ నేల
       తనువు నీ కిమ్మన్న దక్క నియ్యనా
       మనసు రానివాఁడవు మాతోడి గొడవేల
       కొన మాటాడితేఁ జాలు కొసరేనా నేను

చ. 3: యిద్దరిఁ గాఁగిలింపించి యేకము సేయఁగ నేల
       అద్దో‌ నీ చెప్పినట్టు సేయక మానేనా
       గద్దరి శ్రీవెంకటేశ కమ్మటిఁ గూడితి నన్ను
       వొద్ద నీ విట్టే వుంటే వొరసేనా నేను