పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0338-4 సామంతం సంపుటం: 11-226

పల్లవి: నెఱజాణ విన్నిటాను నీ వెఱఁగవా
         యెఱిఁగియును పతి నింత యెలయింతురా

చ. 1: చలము సాదించఁ బోతే సతులు లోఁబడుదురా
       వలపించి పైకొనవలెఁ గాక
       బలిమిఁ బిసుకఁ బోతే పసురు వేసు విరులు
       యెలజవ్వనివి నేఁడు యింత నేతురా

చ. 2: రాజసానఁ దిట్టితేను రామలు మరుగుదురా
       తేజమున దగ్గరి బోధింతురు గాక
       సాజము దప్పఁగ బోతే సరసమే విరస మౌ
       వోజతోడి యీపె నింత వుడికింతురా

చ. 3: పంతాలు నెరపఁ బోతే పడఁతులు లోఁగేరా
       చెంత రతులఁ గూడి మెచ్చింతురు గాక
       యింతలో శ్రీవెంకటేశ యిద్దరు నేక మయితిరి
       అంత కంత కొక రొక రలయింతురా