పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0337-4 సామంతం సంపుటం: 11-220

పల్లవి: ఇంత నేరకున్నవాఁడె యిన్నిటాఁ గూళ
         వంతు వా లెంచకుండేవాఁడె జాణ

చ. 1: కూరిమితో నాఁడువారు కోపగించినట్టివేళ
       వైరము లేక నవ్వెటివాఁడు వో జాణ
       ఆరయ నలుకతోడ నట్టె యంత దిట్టినాను
       గారవించి వేడుకొన్నఘనుఁడు వో జాణ

చ. 2: అలిగి ప్రాణేశ్వరి అవ్వలిమో మైనవేళ
       వలపుతో బుజ్జగించేవాఁడు వో జాణ
       చలి వేఁడి సిగ్గుతోడ సటలకు బిగియఁగా
       బలిమి సేసి పైకొన్న పతియ పో జాణ

చ. 3: అల్లప్పుడే రావైతి మని సాదించేవేళ
       వల్లె వేసి చెక్కు నొక్కేవాఁడె జాణ
       వెల్లవిరి గాఁగ శ్రీవెంకటేశ కూడితివి
       చల్లని నీవంటి మంచి సరసుఁడే జాణ