పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0337-2 సామంతం సంపుటం: 11-218

పల్లవి: ఎప్పటి కెప్పటి వాదు లిఁక నేఁటికి
         కుప్పలుగాఁ బంత మిచ్చేఁ గూచుండఁ గదరా

చ. 1: ఊరకున్నవారి మమ్ము నుడికించి నవ్వ నేల
       ఆరయ నా మాఁటఁ బడి యలుగ నేల
       కూరిమి గలుగువారు కొసరితే నే మాయ
       మేరతోనె వేఁడుకొంటి మెచ్చి నన్నుఁ జూడరా

చ. 2: చింతతో నుండిన నాపైఁ జేయి చాఁచ రా నేల
        యింతలో విదిలించి వేయించుకో నేల
        యింతు లైనవా రేమన్నా నే మాయ బురుషులకు
        రంతు లేల నీకు మెక్కే రారా మా యింటికి

చ. 3: పాయపువారిఁ గూడి పాసి కొంత వేఁచ నేల
       సేయరానిచేఁతఁ బడి సిగ్గు లిం తేల
      యీయెడ శ్రీవెంకటేశ యిట్టె నే నిన్నుఁ గూడితి
      కాయము గాయముఁ గూడె కడమ మా టాడరా