పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0336-5 శంకరాభరణం సంపుటం: 11-215

పల్లవి: చేరి నీకుఁ దగ బుద్ది చెప్పుఁ గాక
         వేరొకతె నీచేత వేఁగఁ బోయీనా

చ. 1: అచ్చట నీ వెవ్వతెనో అంటుకొన్నది చాలక
       యిచ్చగించి నాతోఁ జెప్ప విది యొకటె
       నిచ్చ నేఁ గాఁగానె కాక నీచేత మరొకతె
       వచ్చి వెచ్చి రోఁతలఁ బడఁ బోయీనా

చ. 2: కానకుండ వింతసతి గైకొన్నదిఁ గాక నన్ను
       దానిపేర బిలిచేవు తగురా నీవు
       కానీరా నాకంటె వేరె గయ్యాళి దొక తైతె
       వూనిక నీ సుద్దులకు వోరుచు కుండీనా

చ. 3: వీదిఁ బోయేదానితోడ వెస నవ్వుతాఁ గాక
       యీదెసకుఁ బిలిచేవు యింత వలెనా
       వేద దీర నిను శ్రీవెంకటేశ కూడితిని
       ఆదరించి వింతది నీ వాడిన ట్లాడీనా