పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0336-4 గుండక్రియ సంపుటం: 11-214

పల్లవి: చీ చీ యిందుకే పో సిగ్గయ్యీ నాకు
         యేచి యంతరు మాలిన యీడు జోడు లేలరా

చ. 1: చెప్పిన ట్టెల్లా నేను సేసేఁ గాని యిందరితో
       వొప్పగు వరుసవంతు లొల్లరా యింక
       యెప్పుడు నీ దీవెనె యిదె నన్ను మన్నించుట
       కప్పి వల పెల్ల నొక్కగాడిఁ గట్ట వద్దురా

చ. 2: అంది నీ యా నాజ్ఞలోన నణఁగి వుండేఁ గాని
       సందడిలో కొలువులు చాలురా నాకు
       ముందు నీవు నావాఁడవె మొక్కేఁ గాని గాజు దెచ్చి
       చందపుమాణికముతో సరి సేయ రాకురా

చ. 3: సరుస గూచుండేఁ గాని జంగిలి విడేలలోన
       వొరిమెకుఁ జేయి చాఁచ నోపరా నేను
       గరిమె శ్రీవెంకటేశ కాఁగిఁట గూడితి విట్టె
       పరగఁ దెల్లని వెల్లాఁ బా లంటా నుండకురా