పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0335-2 ఆహిరి సంపుటం: 11-206

పల్లవి: ఒత్తి నీవు దగ్గరితే నొద్దనదు సతి నిన్ను
         చిత్త మెరఁగక గుట్టు సేసిఁ గాని

చ. 1: నిలువెల్లఁ బులకలే నిన్నుఁ జూచేప్పటనుండి
       కలికి పయ్యద నట్టె కప్పీఁ గాని
       తలఁ పెల్లఁ దమకమే తనకు నీ విటుపై పైఁ
       బిలువఁగా నూరకె బిగిసీఁ గాని

చ. 2: వెలియల్ల చింతలే మినుకలి నాటనుండి
       తల వంచి నీకుఁ గొంత దాఁచీఁ గాని
       పలు కెల్ల దైన్యమే పడఁతి నియ్యెడకు
       చలి వేఁడి రాజసాలు జరపీఁ గాని

చ. 3: వయ సెల్ల వలపులే వనిత నిన్నటనుండి
       నయము సేసుక నీతో నవ్వీఁ గాని
       క్రియ యెరిఁగి కూడితి కెలన శ్రీవెంకటేశ
       జయ మందెఁ జెలి నీతో సరసము గాని