పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0335-1 దేసాక్షి సంపుటం: 11-205

పల్లవి: ఇద్దరి జాడలూఁ గంటి మిప్పుడే నేము
         ముద్దులు మోవులు మీలో మోఁపి గొణఁగితిరి

చ. 1: మంతనాన నోతోడ మాటలాడేవేళ
       యింతి బొమ్మముడి వెట్టి నేఁటికో కాని
       చెంతల నందుకుఁ గానె చెప్పరాని తిట్టు దిట్టి
       అంతలోఁ గాఁగిలించితి వౌ నయ్య నీవు

చ. 2: ఆరజాన నాపె నీకు ఆకు మడి చిచ్చి యిచ్చి
       యీరసానఁ గోపగించె నేఁటికో కాని
       చేరి నీ వందుకు గానె చేయి వట్టి తోసుకొని
       కూరిమి తొడపై నిడుకొంటివయ్య నీవు

చ. 3: మంచముపై నుండి యాకె మలగుపై నొరగుతా
       యించుకంత గోర నూఁదె నేఁటికో కాని
       చంచుల శ్రీవెంకటేశ సన్నెరిఁగి కూడితివి
       మించిన మీ నేరుపులు మే లయ్య నేఁడు