పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0334-6 హిందోళవసంతం సంపుటం: 11-204

పల్లవి: ఎరవు సేసుకొనేవు యింకా నేలా
         సిరసు నీవు వంచితే చేఁత లెల్ల మానునా

చ. 1: సేసకొప్పుతోడిది చెమటముత్యాలది
       సేసిన నీ పొందు మాతోఁ జెప్పుకొన్నది
       పూసినజవ్వాదిపూఁత బుగులుకొనఁ బయ్యద
       వేసిన వల్లెవాటుతో వేలఁ జూపీ నిన్నునూ

చ. 2: దొరతనములది యేతుల చిట్లుగందారిది
       మురిపేన నీ దిక్కు మొక మైనది
       సురతాంతమున నీ సోఁకినగురుతు లెల్ల
       పరగఁ జెలుల కెల్ల బయలు సేసీని

చ. 3: కన్నుల మొక్కులది గయ్యాళి చేఁతలది
       తన్నుఁ దానె నిన్నుఁ జూచి తనియనిది
       యిన్నిటా శ్రీవెంకటేశ యిటు నీవు గూడఁగాను
       పన్ని నీ పరవుమీఁదఁ బవళించినది