పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0334-3 కేదారగౌళ సంపుటం: 11-201

పల్లవి: ఇంకమీఁద వచ్చేపని కిప్పు డేఁటికే
         మంకు దీరఁ దన్నింతలో మంచివానిఁ జేసేనా

చ. 1: కానీ లేవె తనమాట కల్లనేనా యిందరిలో
       నాన నిచ్చి వెనకనె నవ్వేఁ గాక
       ఆన లేల పెట్టుకొనీ నంతలోనె లే దంటా
       నే నిట్టే యిందుకు తన్ను నిజమరి అనేనా

చ. 2: తడవ నేలె నేను తనగుణా లిందరిలో
        వడి వెట్టి మరఁగున వంచేఁ గాని
        తొడిఁబడఁ జేయ వట్టీ దోస మన్నా మానఁడు
        వొడఁబడి యిందుకే నే నొక్కటి యైతినా

చ. 3: దంట నై యలుగ లేనె తనుఁ గోపించేవేళ
       వొంటిఁ జిక్కించుక వేరె వొరసేఁ గాక
       యింటిలోన శ్రీవెంకటేశుఁడిట్టె నన్ను గూడె
       అంటి ముట్టి తొంటివెంగే లాడక మానేనా